CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 9:29 pm Posted by : CHAITHANYA GALAM NEWS

పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ సైకిల్‌ ర్యాలీ

  • విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందించడమే లక్ష్యం: ఏసీపీ సదానందం

హుస్నాబాద్‌, అక్టోబర్‌ 27 (చైతన్యగళం): పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా హుస్నాబాద్‌లో సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఏసీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేడ్కర్‌ విగ్రహం వరకు కొనసాగింది. విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొని విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఏసీపీ సదానందం మాట్లాడుతూ, ప్రజల రక్షణ కోసం విధులు నిర్వర్తిస్తూ ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. వారి త్యాగాలను నేటి తరానికి తెలియజేయడంతోపాటు విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించడమే ర్యాలీ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

పోలీసుల విధులు, ప్రజల భద్రత కోసం వారు అందిస్తున్న సేవలపై యువతకు అవగాహన కల్పించడం, పోలీసులకు–ప్రజలకు మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని వివరించారు. పోలీసు అమరవీరుల స్ఫూర్తితో యువత సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏసీపీ సదానందం, సీఐ శ్రీధర్‌, హుస్నాబాద్‌ ఎస్‌ఐ లక్ష్మారెడ్డి, అక్కన్నపేట ఎస్‌ఐ ప్రశాంత్‌, ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ, సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.