CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 9:45 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఈవీఎం గోదాం తరలింపునకు ప్రత్యామ్నాయ వసతుల పరిశీలన

  • ఎన్నికల సంఘాల అనుమతులతోనే తరలింపు చేపట్టాలి: కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌

నాగర్‌కర్నూల్‌, అక్టోబర్‌ 27 (చైతన్యగళం): నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమీపంలో ప్రస్తుతం ఉన్న ఈవీఎం గోదాం జాతీయ రహదారి 167కే నిర్మాణ పనుల పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో, దానిని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు తరలించేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ భవన వసతులను జిల్లా కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ పరిశీలించారు. అదనపు కలెక్టర్‌ బి. చెన్నయ్య, నాగర్‌కర్నూల్‌ ఆర్డీఓ అర్చనతో కలిసి మంగళవారం మార్కెట్‌ యార్డును సందర్శించి, గోదాం ఏర్పాటుకు అనువైన గదులను పరిశీలించారు.

ఈ సందర్భంగా గోదాం తరలింపునకు అవసరమైన తాత్కాలిక ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. నూతన ఈవీఎం గోదాం నిర్మాణం పూర్తయ్యే వరకు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల భద్రత, రక్షణ, నిల్వకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. భద్రతాపరమైన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.

ఈవీఎం గోదాం తరలింపు ప్రక్రియ ప్రారంభించే ముందు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల నుంచి నిబంధనల ప్రకారం అవసరమైన అనుమతులు తప్పనిసరిగా పొందాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. సంబంధిత అనుమతులు లభించిన తర్వాతే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాం తరలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ పరిశీలనలో కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ రవికుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.