CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 3:37 pm Posted by : CHAITHANYA GALAM NEWS

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

  • పార్టీ శ్రేణులకు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పిలుపు

ఇబ్రహీంపట్నం, అక్టోబర్‌ 27 (చైతన్యగళం): రానున్న మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్నికల ఇన్‌చార్జి, మాజీ మండలి చైర్మన్‌ స్వామి గౌడ్‌, భువనగిరి పార్లమెంట్‌ బీఆర్ఎస్ ఇన్‌చార్జి క్యామ మల్లేష్‌ హాజరయ్యారు.

సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కీలక అంశాలు, ఓటర్ల నమోదు, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం, ఎన్నికల కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. నియోజకవర్గంలోని ప్రతి పట్టభద్ర ఓటరును కలిసి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించాలని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నాయకులకు సూచించారు.

నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. యువత, పట్టభద్రుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లి, బీఆర్ఎస్‌కు మద్దతు కూడగట్టాలని సూచించారు. పట్టభద్రుల సమస్యలపై బలంగా గళం వినిపించే తమ పార్టీ అభ్యర్థి విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని అన్నారు.

స్వామి గౌడ్‌, క్యామ మల్లేష్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించాలని కోరారు. ఎన్నికలకు ముందు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని వారు విమర్శించారు.

ఈ సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలు, మున్సిపాలిటీల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, సమన్వయ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.