CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 10:04 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్‌ అనవసర రాద్ధాంతం చేస్తోంది

నవంబర్‌ 5న కరీంనగర్‌లో భారీ ర్యాలీకి తరలిరావాలి: బోయినపల్లి ప్రవీణ్‌రావు

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌ 26 (చైతన్యగళం): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై కాంగ్రెస్‌ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ కరీంనగర్‌ పార్లమెంట్‌ కన్వీనర్‌ బోయినపల్లి ప్రవీణ్‌రావు విమర్శించారు. నవంబర్‌ 5న కరీంనగర్‌లో నిర్వహించనున్న భారీ ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆదివారం కరీంనగర్‌ కొత్తపల్లి మండలంలో నిర్వహించిన పోలింగ్‌ బూత్‌ సమావేశంలో, ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమ వీక్షణలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌రావు మాట్లాడుతూ.. నకిలీ ఓట్లను, మరణించిన వ్యక్తుల పేర్లతో ఉన్న ఓట్లను తొలగించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. గతంలోనూ పలు దశల్లో ఓటర్ల జాబితాల సవరణ జరిగిందని, సుదీర్ఘ విరామం తర్వాత 2025–2026లో ఈ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌, ఎన్నికల వ్యవస్థపై అసత్య ప్రచారాలు చేస్తోందని ప్రవీణ్‌రావు ఆరోపించారు. దేశాన్ని దాదాపు ఐదు దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పుడు ఓట్ల చోరీ పేరుతో ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీ, ప్రధాని మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అక్రమంగా ఓటు హక్కు పొందినవారి పేర్లు తొలగిస్తారనే కారణంతోనే కాంగ్రెస్‌ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని ఆయన ఆరోపించారు. నకిలీ ఓట్ల తొలగింపును కాంగ్రెస్‌ ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీ చేస్తున్న ఓట్ల చోరీ ఆరోపణలు అర్థరహితమని విమర్శించారు.

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్‌ వైఖరిని ఎండగట్టేందుకు కరీంనగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రవీణ్‌రావు తెలిపారు. ఈ ర్యాలీకి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హాజరవుతారని వెల్లడించారు. యువత, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సమావేశం అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రధాని ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కుంట తిరుపతి, శక్తి కేంద్ర ఇన్‌చార్జి వేముల అనిల్‌కుమార్‌, బూత్‌ అధ్యక్షులు ఎగ్గోజు సంపత్‌ చారి, బోనాల పరశురాములు, గ్రామ సర్పంచ్‌ నునుగొండ మానస ప్రవీణ్‌, వార్డు సభ్యులు రుద్ర రాజ్‌కుమార్‌, పెంట సురేష్‌, సీనియర్‌ నాయకులు మెరుగు మల్లేశం, వరాల మల్లేశం, పెంటి సంతోష్‌కుమార్‌, గీ గురు చందు, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.