CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 7:43 pm Posted by : CHAITHANYA GALAM NEWS

నగరాభివృద్ధికి పెద్దపీట వేస్తాం

  • 66 డివిజన్లలో దశలవారీగా అభివృద్ధి పనులు.. మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌
  • సరస్వతినగర్‌లో రూ.40.70 లక్షలతో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

కరీంనగర్‌, అక్టోబర్‌ 25 (చైతన్యగళం): కరీంనగర్‌ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ తెలిపారు. నగరంలోని రెండో, ఎనిమిదో డివిజన్లలో ఆదివారం ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రెండో డివిజన్‌ సరస్వతినగర్‌లో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధుల నుంచి రూ.40.70 లక్షలతో చేపట్టనున్న ఆర్‌సీసీ పైపులైన్‌ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా డివిజన్‌ వాసులు మేయర్‌కు ఘనస్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సత్కరించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు మేయర్‌ సూచించారు.

అనంతరం ఎనిమిదో డివిజన్‌ అలుగునూరులో స్థానిక కార్పొరేటర్‌ కాల్వ మల్లేశంతో కలిసి పర్యటించారు. వరంగల్‌ రోడ్డు, హైదరాబాద్‌ చేపలకాలనీ ప్రాంతాల్లో స్థానిక ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన వారసంతలను ప్రారంభించారు. అలాగే ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణ పనులతోపాటు బస్సు షెల్టర్లను ప్రారంభించారు. అలుగునూరులో ఎస్సీ వర్గాల ప్రజలకు తాగునీటి సదుపాయాలు కల్పించేందుకు బోరుబావుల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ సహకారంతో మంజూరైన బోరుబావుల పనులను చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్లలో యూసీఎఫ్‌ నిధులతో సుమారు రూ.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ సహకారంతో అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ కింద కరీంనగర్‌ నగరపాలక సంస్థకు రూ.840 కోట్ల నిధులు సమకూరినట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో చేపట్టనున్న పనులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికకు ఇటీవల ఆమోదం లభించిందని, త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే నగరంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకుండా కాంట్రాక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

నగరంలో వీధికుక్కల సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని మేయర్‌ తెలిపారు. 66వ డివిజన్‌ పరిధిలో జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ, దాని సామర్థ్యం, అవసరమైన సదుపాయాలను మరింత పెంచాల్సి ఉందన్నారు. స్మార్ట్‌ సిటీ నిధుల కింద సుమారు రూ.2 కోట్లతో కేంద్రానికి సంబంధించిన పనుల టెండర్‌ ప్రక్రియ పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎనిమిదో డివిజన్‌లో ప్రారంభించిన రెండు వారసంతలు స్థానిక ప్రజలకు అవసరమైన వస్తువులను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు చిన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.

రానున్న వేసవిని, ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వినియోగించాలని మేయర్‌ విజ్ఞప్తి చేశారు. అవసరమైన మేరకే నీటిని వాడుకోవాలని, వృథాను అరికట్టాలని సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని కోరారు. భవిష్యత్తులో నీటి కొరత తలెత్తకుండా ప్రజలంతా బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

ప్లాస్టిక్‌ వినియోగం పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హానికరమని పేర్కొన్న మేయర్‌.. ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల కాలుష్యం పెరుగుతోందని, వాటి వినియోగాన్ని తగ్గించి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని సూచించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. నగరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం కోసం ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.