CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 8:57 pm Posted by : CHAITHANYA GALAM NEWS

తంగెడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

  • తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వైద్య సేవలు.. డాక్టర్ తంగెడ ప్రేమానందరావు

ఎల్కతుర్తి గ్రామీణం, అక్టోబర్ 25 (చైతన్యగళం): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో తంగెడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ తంగెడ ప్రేమానందరావు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శిబిరం సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగింది. హైదరాబాద్‌కు చెందిన వివిధ విభాగాల ఆయుర్వేద వైద్యులు పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు.

సూరారం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు శిబిరానికి తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు రోగులను పరీక్షించి, అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా వైద్య సలహాలు అందించడంతో పాటు ఆయుర్వేద మందులను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ తంగెడ ప్రేమానందరావు మాట్లాడుతూ, ఎల్కతుర్తి మండలంలో తొలిసారిగా ఈ తరహా ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 40 ఏళ్లు దాటిన వారిలో మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఇలాంటి శిబిరాల ద్వారా ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య సమస్యలకు తగిన సలహాలు, చికిత్స అందించడమే ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశమని వివరించారు. కొన్ని రకాల నొప్పుల ఉపశమనానికి ఆయుర్వేద చికిత్స తోడ్పడుతుందని పేర్కొంటూ, ప్రజలు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలని సూచించారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు.

గ్రామీణ ప్రజలకు వైద్య సేవలను చేరువ చేసేందుకు తంగెడ ఫౌండేషన్ చేస్తున్న కృషిని గ్రామస్తులు అభినందించారు. శిబిరం నిర్వహణలో వైద్యులు, ఫౌండేషన్ నిర్వాహకులకు సహకరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాషాబోయిన నీలకొంరయ్య, ఉపసర్పంచ్ మేకల బాబు, నడిపెల్లి ప్రభాకర్‌రావు, తంగెడ ఉమాపతిరావు, గ్రామ మాజీ సర్పంచ్ తక్కళ్లపల్లి సంపతరావు, పిట్టల రమేష్, బీట్ల లింగయ్య, వీరనారాయణపూర్ మాజీ సర్పంచ్ తంగెడ మహేందర్, జగన్నాథపూర్ సర్పంచ్ పంజాల యాదగిరిగౌడ్, తక్కళ్లపల్లి బాపురావు, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.