- కరీంనగర్ జిల్లాలో రూ.26–28 కోట్ల మేర మోసం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో అంచనా
కరీంనగర్, అక్టోబర్ 25 (చైతన్యగళం): యూనిక్ మెర్కంటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్వయం మల్టీస్టేట్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థలకు సంబంధించిన పెట్టుబడుల మోసం కేసులో ఐదుగురు నిందితులను కరీంనగర్ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 212/2026గా నమోదైన కేసులో ఈ చర్యలు చేపట్టారు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ కైలాష్ రాయ్ వివిధ పెట్టుబడి పథకాలను ప్రవేశపెట్టి ప్రజల నుంచి డబ్బులు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నెలవారీ పెట్టుబడి పథకాలు, స్థిర డిపాజిట్లు, స్థిరాస్తి పథకాలు, హోటల్ విహార ప్యాకేజీల పేరుతో ప్రజలను ఆకర్షించినట్లు తెలుస్తోంది. పట్టుబడిన నిందితులు ఏజెంట్లు, ప్రాంతీయ బాధ్యులుగా వ్యవహరిస్తూ కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు.
పెట్టుబడులపై ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామని నమ్మించి బాధితులకు బాండ్ పత్రాలు అందజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2019లో పలు పథకాల గడువు ముగిసినప్పటికీ పెట్టుబడిదారులకు సొమ్ము తిరిగి చెల్లించలేదని, కోవిడ్ కారణంగా నష్టాలు వచ్చాయని చెబుతూ 2020లో కంపెనీ కార్యకలాపాలను నిలిపివేసినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారని సమాచారం. ఈ వ్యవహారంలో కరీంనగర్ జిల్లాలో బాధితులకు సుమారు రూ.26 కోట్ల నుంచి రూ.28 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో అంచనా వేస్తున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్‌కుమార్ కైలాష్ రాయ్‌ను ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేయగా, ప్రస్తుతం ఆయన ఆదిలాబాద్ జైలులో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసులో మరికొందరి ప్రమేయం ఉందా, బాధితుల సంఖ్య ఎంత, పెట్టుబడుల రూపంలో సేకరించిన మొత్తం ఎంత అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
పట్టుబడిన నిందితులను హైదరాబాద్‌కు చెందిన గుడిపాటి గాంధీ, మాకలసోంపల్లి కరియప్ప, ఉల్లిగడ్డల సంగప్ప, నిజామాబాద్‌కు చెందిన కొమిరె భూమా గౌడ్, పెద్దపల్లి జిల్లాకు చెందిన యేదెళ్ల రమేష్‌గా పోలీసులు గుర్తించారు.
ఈ సంస్థల పెట్టుబడి పథకాల ద్వారా నష్టపోయిన బాధితులు ఎవరైనా ఉంటే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో లేదా కరీంనగర్ సీసీఎస్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. బాధితుల ఫిర్యాదులు, నిధుల లావాదేవీలు, ఇతరుల ప్రమేయంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.