CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 12:24 pm Posted by : CHAITHANYA GALAM NEWS

హుస్నాబాద్‌ ‘స్టీల్‌ బ్యాంక్‌’ చొరవకు కేంద్ర మంత్రి ప్రశంసలు

  • సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించే కార్యక్రమంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కు భూపేందర్‌ యాదవ్‌ లేఖ

హుస్నాబాద్‌, అక్టోబర్‌ 23 (చైతన్యగళం):

గ్రామీణ ప్రాంతాల్లో శుభకార్యాలు, ఇతర సామూహిక వేడుకల్లో ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్‌ వస్తువుల వాడకాన్ని తగ్గించేందుకు హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ‘స్టీల్‌ బ్యాంక్‌’ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌ చొరవను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ అభినందించారు. ఈ మేరకు పొన్నం ప్రభాకర్‌కు లేఖ రాస్తూ, ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేందుకు చేపట్టిన ఈ ఆలోచన ప్రాధాన్యాన్ని వివరించారు.

గ్రామాల్లో జరిగే శుభకార్యాలు, ఇతర వేడుకల్లో ప్రజలు వినియోగించుకునేలా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పాత్రలతో కూడిన పూర్తి సెట్లను అందుబాటులో ఉంచడం ద్వారా ప్లాస్టిక్‌ వినియోగాన్ని, తద్వారా వెలువడే వ్యర్థాలను క్షేత్రస్థాయిలో తగ్గించవచ్చని కేంద్ర మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.

ప్లాస్టిక్‌ కాలుష్య నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని భూపేందర్‌ యాదవ్‌ వివరించారు. అధిక కాలుష్యానికి కారణమయ్యే, తక్కువ ఉపయోగకరమైన గుర్తించిన సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులపై నిషేధం విధించడం, ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్‌ విషయంలో ఉత్పత్తిదారుల విస్తరించిన బాధ్యతను అమలు చేయడం, వస్తువుల పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలు ఇందులో భాగమని తెలిపారు.

ప్లాస్టిక్‌కు పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ రూపొందించిన ‘సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులకు ప్రత్యామ్నాయాల తయారీదారులు, విక్రేతల సంకలనం’ను 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విడుదల చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ సంకలనం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో పాటు సమాజంలోని అన్ని వర్గాలు సమన్వయంతో కృషి చేస్తే ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్‌ వల్ల కలిగే కాలుష్యాన్ని సమర్థవంతంగా, దీర్ఘకాలికంగా నియంత్రించవచ్చని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.

శుభకార్యాలు, సామూహిక వేడుకల్లో స్టీల్‌ పాత్రలను తిరిగి వినియోగించేలా ప్రోత్సహించడం ద్వారా ప్లాస్టిక్‌ వ్యర్థాలను తగ్గించాలన్న ‘స్టీల్‌ బ్యాంక్‌’ ఆలోచన గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణహిత జీవన విధానానికి తోడ్పడనుంది. మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేపట్టిన ఈ చొరవ పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఉపయోగపడనుంది.