CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 11:57 am Posted by : CHAITHANYA GALAM NEWS

పేదల సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఎస్‌.ఆర్‌. శంకరన్‌

మహబూబాబాద్‌ (చైతన్యగళం):

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, గిరిజనుల సంక్షేమానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మానవతావాది విశ్రాంత ఐఏఎస్‌ అధికారి స్వర్గీయ ఎస్‌.ఆర్‌. శంకరన్‌ అని నలంద విద్యాసంస్థల కరస్పాండెంట్‌ డాక్టర్‌ డోలి సత్యనారాయణ అన్నారు. మహబూబాబాద్‌లోని నలంద డిగ్రీ కళాశాలలో సామాజిక అధ్యయన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, ప్రభుత్వ విశ్రాంత ఉపాధ్యాయుడు పార్నంది రామయ్య అధ్యక్షతన శంకరన్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ డోలి సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి నుంచి ఉన్నత పదవుల వరకు బాధ్యతలు నిర్వహించిన ఎస్‌.ఆర్‌. శంకరన్‌ సామాన్య ప్రజల సంక్షేమానికి విశేష కృషి చేశారని కొనియాడారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, వారి అభ్యున్నతికి బాటలు వేశారని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల ద్వారా అణగారిన వర్గాలకు అవకాశాలు అందేలా కృషి చేసిన సేవాతత్పరుడని అన్నారు.

వ్యక్తిగత అవసరాల కంటే పేద ప్రజల సంక్షేమానికే అధిక ప్రాధాన్యమిచ్చిన శంకరన్‌ నిరాడంబర జీవనశైలితో అందరికీ ఆదర్శంగా నిలిచారని డాక్టర్‌ సత్యనారాయణ పేర్కొన్నారు. తన జీతాన్ని సైతం పేదల కోసం ఖర్చు చేసిన దయార్ద్ర హృదయుడిగా ఆయన సేవలను గుర్తుచేశారు. సామాజిక న్యాయం పట్ల నిబద్ధత, సేవాభావం, నిరాడంబరతకు ప్రతీకగా నిలిచిన ఎస్‌.ఆర్‌. శంకరన్‌ జీవితాన్ని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మైస నాగయ్య, ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి విష్ణువర్ధన్‌, కళాశాల ప్రిన్సిపల్‌ వై. కృష్ణప్రసాద్‌, అధ్యాపకులు ఎం. రమేష్‌, కె. ప్రసాద్‌, ఎస్‌. ప్రసాద్‌, ఎం.డి. గౌస్‌ పాషా, వైస్‌ ప్రిన్సిపల్‌ కె.బి. శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.