- కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 29 కేసులు.. 122 మంది నిందితుల గుర్తింపు
కరీంనగర్, అక్టోబర్ 24 (చైతన్యగళం): సైబర్ మోసాలకు వినియోగిస్తున్న మ్యూల్ బ్యాంకు ఖాతాలపై కరీంనగర్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు చేపడుతున్నారు. ఈ వ్యవహారాలకు సంబంధించి కమిషనరేట్ పరిధిలోని 16 పోలీస్ స్టేషన్లలో ఇప్పటివరకు 29 కేసులు నమోదు కాగా, 122 మందిని నిందితులుగా గుర్తించినట్లు పోలీసు కమిషనర్ గౌస్ ఆలం వెల్లడించారు.
గుర్తించిన 122 మంది నిందితుల్లో 89 మందిపై అరెస్టు లేదా చట్టపరమైన నోటీసుల రూపంలో చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 33 మందిపై చర్యలు పెండింగ్‌లో ఉన్నాయని సీపీ వివరించారు.
పోలీస్ స్టేషన్ల వారీగా పరిశీలిస్తే, కరీంనగర్ వన్‌టౌన్‌లో ఆరు కేసులు నమోదు కాగా, 20 మంది నిందితులను గుర్తించి 13 మందిపై చర్యలు తీసుకున్నారు. మరో ఏడుగురిపై చర్యలు పెండింగ్‌లో ఉన్నాయి. కరీంనగర్ టూటౌన్‌లో ఐదు కేసుల్లో 26 మంది నిందితులను గుర్తించగా, 16 మందిపై చర్యలు తీసుకుని, మరో పది మందిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. కరీంనగర్ త్రీటౌన్‌లో రెండు కేసులు నమోదు కాగా, 12 మంది నిందితుల్లో పదిమందిపై చర్యలు పూర్తయ్యాయి. మరో ఇద్దరిపై చర్యలు పెండింగ్‌లో ఉన్నాయి.
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసులో ఆరుగురిని నిందితులుగా గుర్తించగా, ఒకరిపై చర్యలు తీసుకున్నారు. మరో ఐదుగురిపై చర్యలు పెండింగ్‌లో ఉన్నాయి. జమ్మికుంట టౌన్‌లో మూడు కేసులకు సంబంధించి 15 మంది నిందితులను గుర్తించి, 11 మందిపై చర్యలు తీసుకున్నారు. మరో నలుగురిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. హుజూరాబాద్ టౌన్‌లో రెండు కేసుల్లో పది మందిని నిందితులుగా గుర్తించగా, తొమ్మిది మందిపై చర్యలు తీసుకున్నారు. మరొకరిపై చర్యలు పెండింగ్‌లో ఉన్నాయి.
కొత్తపల్లిలో రెండు కేసులకు సంబంధించి ఐదుగురిపై, చొప్పదండిలో ఒక కేసులో ఐదుగురిపై, ఇల్లందకుంటలో ఒక కేసులో ఐదుగురిపై, గంగాధరలో ఒక కేసులో ఆరుగురిపై చర్యలు పూర్తయ్యాయి. మానకొండూరులో రెండు కేసుల్లో ముగ్గురిని నిందితులుగా గుర్తించగా, ఒకరిపై చర్యలు తీసుకుని, మరో ఇద్దరిపై చర్యలు పెండింగ్‌లో ఉన్నాయి. ఎల్‌ఎండీ కాలనీ పరిధిలో ఒక కేసులో ఏడుగురిని నిందితులుగా గుర్తించి, ఆరుగురిపై చర్యలు తీసుకున్నారు. మరో వ్యక్తిపై చర్యలు పెండింగ్‌లో ఉన్నాయి. సైదాపూర్‌లో ఒక కేసుకు సంబంధించి ఒకరిపై చర్యలు పూర్తయ్యాయి. వీణవంకలో ఒక కేసు నమోదవగా, నిందితుడి అరెస్టు పెండింగ్‌లో ఉంది. కేశవపట్నం, రామడుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటివరకు ఈ తరహా కేసులు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.
ప్రజలు తమ బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, వాటికి సంబంధించిన రహస్య వివరాలు, ఓటీపీలు ఇతరులకు ఇవ్వవద్దని సీపీ గౌస్ ఆలం హెచ్చరించారు. కమీషన్ల ఆశ చూపి తమ ఖాతాలను ఇతరుల లావాదేవీలకు వినియోగించేందుకు అనుమతించడం కూడా చట్టపరమైన సమస్యలకు దారితీస్తుందని స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్లకు తమ ఖాతాల ద్వారా సహకరించే వారిని కూడా నేరంలో భాగస్వాములుగా పరిగణించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా వివరాలు వెల్లడించకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.