- ఘనంగా ముగిసిన 25వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
మహబూబాబాద్: పట్టణ కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 25వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై అమ్మవారిని ఊరేగిస్తూ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ్య సలహాదారు చౌడవరపు మోహన్‌రావు పర్యవేక్షణలో శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గత తొమ్మిది రోజులుగా ఆర్యవైశ్యులు అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం తో పాటు వివిధ రకాల నైవేద్యాలు సమర్పించి, అమ్మవారిని ప్రత్యేక అలంకరణలతో పూజించారని పేర్కొన్నారు.
వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవాయిద్యాలు, భక్తుల జయజయ ధ్వానాలు, భక్తిగీతాల నడుమ శోభాయాత్ర కన్నులపండువగా సాగింది. అమ్మవారి నామస్మరణతో పట్టణంలోని పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.