టీటీడీ ఆధ్వర్యంలో పనులు.. నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్, అక్టోబర్ 22 (చైతన్యగళం): కరీంనగర్ నగరంలోని పద్మనగర్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని 18 నెలల్లో పూర్తి చేయనున్నట్లు కాంట్రాక్టర్లు తెలిపారు. బుధవారం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు.
నిర్మాణ పనుల పురోగతి, ఇప్పటివరకు పూర్తయిన పనులు, తదుపరి చేపట్టాల్సిన పనుల వివరాలను కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసేలా పనులు కొనసాగించాలని సూచించారు. నిర్మాణ పనుల ప్రస్తుత స్థితి, పూర్తికి పట్టే సమయంపై కాంట్రాక్టర్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కొత్తపల్లి మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతినాయక్, స్థానిక కార్పొరేటర్ గడ్డి ప్రదీప్, మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేందర్‌రావు, బోనాల శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ ఒళ్లాల మల్లేశం, శుంకిశాల సంపత్‌రావు, కర్ర సూర్యశేఖర్, నేతి రవివర్మతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.