CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 9:12 am Posted by : CHAITHANYA GALAM NEWS

కరీంనగర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

  • మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు
  • మానేరు డ్యామ్‌ వద్ద నిమజ్జన కార్యక్రమం

కరీంనగర్‌, అక్టోబర్‌ 18 (చైతన్యగళం):

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు కరీంనగర్‌ నగరంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని భగత్‌నగర్‌లో భగత్‌నగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, ఆదర్శ జైభీమ్‌ యూత్‌ క్లబ్‌, చైతన్య యూత్‌ క్లబ్‌, పెద్దమ్మ యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో, కపిలేశ్వరస్వామి ఆలయం, సాయికృష్ణ థియేటర్‌ పరిసరాలతో పాటు రాంనగర్‌లోని సత్యనారాయణస్వామి ఆలయం వద్ద బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి.

ఈ వేడుకలకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌, మాజీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. వాటి చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడారు. యాదగిరి సునీల్‌రావు సైతం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి వేడుకల్లో పాల్గొన్నారు.

అనంతరం లోయర్‌ మానేరు డ్యామ్‌ సమీపంలోని లేక్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన కేంద్రంలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

ఈ సందర్భంగా యాదగిరి సునీల్‌రావు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. మహిళలంతా ఒకచోట చేరి ఐక్యతతో, ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగను జరుపుకోవడం మన సంప్రదాయాల గొప్పతనాన్ని చాటుతుందని పేర్కొన్నారు. భగత్‌నగర్‌లోని వివిధ సంక్షేమ సంఘాలు, యువజన సంఘాలు సమష్టిగా ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గాజ రమ–శివరాం, పొన్నం లక్ష్మి–మొండయ్య గౌడ్‌, వివిధ యువజన సంఘాల సభ్యులు, కాలనీ పెద్దలు, స్థానిక నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.