హుజూరాబాద్, అక్టోబర్ 18 (చైతన్యగళం):
హుజూరాబాద్ నియోజకవర్గంలో సద్దుల బతుకమ్మ వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో హుజూరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్‌రెడ్డి తన సతీమణి పాడి శాలినీరెడ్డి, కుమార్తె పాడి శ్రీనికా రెడ్డితో కలిసి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంతో పాటు హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలు, వీణవంక మండల కేంద్రంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో భాగస్వామ్యమై, పండుగ విశిష్టతను చాటిచెప్పారు.

ఈ సందర్భంగా బతుకమ్మకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, వేడుకల్లో పాల్గొన్న మహిళలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, మహిళలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు, మన సంస్కృతి సంప్రదాయాల వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పిలుపునిచ్చారు.