- వేడుకల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాజు నాయక్
హుస్నాబాద్, అక్టోబర్ 18 (చైతన్యగళం):
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు, ఆడపడుచులు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ భక్తిశ్రద్ధలతో సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవడం అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని ఆకాంక్షించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇలాంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏల్పుగొండ కొమురమ్మ, రవీందర్, వార్డు సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షుడు కందరపు రాజమౌళి, మాజీ సర్పంచులు గోర్ల కుమారస్వామి, రాగుల సమ్మయ్య, పెద్దతండ మాజీ సర్పంచ్ సకృ నాయక్, బీఆర్‌ఎస్ నాయకులు బావు సదానందం, పంజ సంపతి, యువజన విభాగం అధ్యక్షుడు గుండ్రబోన రాజు, గ్రామ ప్రజలు, మహిళలు, ఆడపడుచులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.