- ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనే ప్రణాళిక ఏది?
- రైతులను భయపెట్టడం కాదు.. భరోసా కల్పించాలి – మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
కరీంనగర్, అక్టోబర్ 16 (చైతన్యగళం): ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందంటూ రైతులను ఆందోళనకు గురిచేయడం కాకుండా, ఆ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళికను వెల్లడించాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. యాసంగి పంటలు వేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు సూచించడం సిగ్గుచేటని విమర్శించారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు విందు ప్రాంగణంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రైతులకు అండగా నిలవాలి
రైతులకు 24 గంటల విద్యుత్తు అందించాల్సి ఉండగా, కొన్ని ప్రాంతాల్లో నాలుగు గంటలే సరఫరా అవుతోందని సుంకె రవిశంకర్ ఆరోపించారు. విద్యుత్తు కోతల కారణంగా పంటలకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనరేటర్లను వినియోగించాల్సి రావడంతో ఒక్కొక్క రైతుపై అదనంగా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు భారం పడుతోందన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. పంటలు వేయొద్దని సూచించడం ఏమిటని ప్రశ్నించారు. పంటల సాగు విరమణ ప్రకటిస్తే రైతులకు ఎకరానికి రూ.30 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించాలి
తెలంగాణలో ప్రాణహిత, గోదావరి వంటి నదులు ఉన్నప్పటికీ సాగునీటి సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయని రవిశంకర్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు అవసరమైన మరమ్మతులు చేపట్టి సాగునీటి వనరులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఎల్నినో ప్రభావం ఉంటుందని తెలిసినప్పుడు ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీటిని నిల్వ చేసేందుకు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు.
విద్యుత్తు కోతలకు ప్రభుత్వమే బాధ్యత
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు నిరంతర విద్యుత్తు అందించామని, కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించామని రవిశంకర్ పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదని ఆరోపించారు. 24 గంటల విద్యుత్తు సరఫరా, మూడు పంటలకు రైతుభరోసా, ఎకరానికి రూ.15 వేల సాయం వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యుత్తు కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని, బొగ్గు సరఫరా, విద్యుత్తు ఉత్పత్తిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. రైతులకు నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేయడంతో పాటు సాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో పెద్దఎత్తున విద్యుత్తు ఉపకేంద్రాల ముట్టడి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని సుంకె రవిశంకర్ కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్కుమార్ గౌడ్, శాతవాహన విశ్వవిద్యాలయ బీఆర్ఎస్వీ ఇన్చార్జి చుక్కా శ్రీనివాస్, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.