సిద్దిపేట, అక్టోబర్ 16 ( చైతన్యగళం):
సిద్దిపేట జిల్లా ఐడీఓసీ కార్యాలయ ప్రాంగణంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందమైన పూలతో బతుకమ్మలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ సంప్రదాయాల ప్రకారం అమ్మవారిని ఆరాధిస్తారని, భక్తిశ్రద్ధలతో పూజించే వారిని భగవంతుడు తప్పక అనుగ్రహిస్తారని పేర్కొన్నారు. అమ్మవారి శక్తిని స్మరిస్తూ ‘శ్రీ మాత్రే నమః’ అని భక్తితో ప్రార్థించినా అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని తెలిపారు. చండీ హోమం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వీలైనంతవరకు పాల్గొనాలని సూచించారు. ధర్మాన్ని కాపాడేందుకు, దుష్టశక్తులను సంహరించేందుకు దేవతలు వివిధ రూపాల్లో అవతరిస్తారని వివరించారు.
నవరాత్రుల సందర్భంగా ప్రతి ఒక్కరూ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. అమ్మవారు ప్రకృతిలో, ప్రాణశక్తిలో, క్షమాగుణంలో, మర్యాదలో, శరీర కాంతిలో, ఐశ్వర్యంలో వివిధ రూపాల్లో కొలువై ఉంటారని పేర్కొన్నారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని నిష్ఠతో, భక్తిశ్రద్ధలతో పూజించాలని పిలుపునిచ్చారు.
అనంతరం అమ్మవారి స్తోత్రాలను పఠించారు. బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దిన శాఖలకు బహుమతులు ప్రదానం చేశారు. రెవెన్యూ శాఖకు మొదటి బహుమతి, డీఆర్డీఓకు రెండో బహుమతి, పట్టుపరిశ్రమల శాఖకు మూడో బహుమతి అందజేశారు. ఉద్యానవన శాఖ, టీఎన్జీఓలకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. బాలసదనం నుంచి బతుకమ్మలను తయారు చేసి తీసుకువచ్చిన చిన్నారులను జిల్లా కలెక్టర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, డీఆర్ఓ నాగరాజమ్మ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.