- బతుకమ్మ పాటలకు అడుగులు వేసిన మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ దంపతులు
- పాటలు, నృత్యాలతో పండుగ శోభను సంతరించుకున్న నగరపాలక సంస్థ ప్రాంగణం
కరీంనగర్, అక్టోబర్ 16 (చైతన్యగళం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నగరపాలక సంస్థ మహిళా ఉద్యోగులు వివిధ రకాల రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలు, కోలాటాలు, సంప్రదాయ నృత్యాలతో నగరపాలక సంస్థ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.
ఈ వేడుకలకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆయన సతీమణి శ్వేత దేశాయ్, శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారి హరిప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాలకవర్గ సభ్యులు, మహిళా కార్పొరేటర్లు, అధికారులు, ఉద్యోగులతో కలిసి మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ దంపతులు బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా అందరూ ఉత్సాహంగా పాల్గొని సంబరాలు చేసుకున్నారు.
మహిళా ఉద్యోగులు వివిధ రకాల పూలతో కళాత్మకంగా పేర్చిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాలకవర్గ సభ్యులు, ఉద్యోగులు ఒకే వేదికపై కలిసి పండుగను జరుపుకోవడం వేడుకలకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. పర్యావరణంతో ముడిపడిన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. వివిధ రకాల పూలను పేర్చి పూజించే ఈ పండుగ తెలంగాణ ప్రజల ప్రత్యేకతను చాటుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర సంస్కృతిని కాపాడుతూ, దాని గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయడంలో ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు మహిళా కార్పొరేటర్లు, అధికారులు, ఉద్యోగుల మధ్య ఆత్మీయతను, ఐక్యతను పెంపొందించాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ పాలకవర్గ సభ్యులు, సహసభ్యులు, అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేశారు.