CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 7:19 pm Posted by : CHAITHANYA GALAM NEWS

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు ఐక్యంగా పనిచేయాలి

  • టీడీపీ, వైసీపీలపై కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ విమర్శలు

నందికొట్కూరు, అక్టోబర్‌ 16 (చైతన్యగళం‌): రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి, అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం నందికొట్కూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తేనే నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ, నందికొట్కూరు మున్సిపాలిటీలోని 32 వార్డులతోపాటు మున్సిపల్ చైర్మన్ పదవికి కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. టీడీపీ, వైసీపీలు ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమయ్యాయని, బీసీలకు అన్యాయం చేశాయని విమర్శించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను విమర్శించే స్థాయి ప్రాంతీయ పార్టీలకు లేదని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిని గెలిపిస్తే నందికొట్కూరు పట్టణ రూపురేఖలను మారుస్తామని, దీర్ఘకాలంగా పట్టణ ప్రజలను వేధిస్తున్న డంపింగ్‌ యార్డు సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ఎన్నికల బరిలోకి దిగుతున్నామని తెలిపారు. ప్రతి వార్డులో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ, పట్టణ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.