CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 10:12 am Posted by : CHAITHANYA GALAM NEWS

హుస్నాబాద్‌కు దసరా కానుక.. నూతన కబడ్డీ అకాడమీ మంజూరు

  • మంత్రి పొన్నం ప్రభాకర్‌ కృషితో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
  • 40 మంది క్రీడాకారులకు శిక్షణ.. బాలురు, బాలికలకు చెరో 20 మందికి అవకాశం

కరీంనగర్ , అక్టోబర్ 16 (చైతన్యగళం): హుస్నాబాద్‌ నియోజకవర్గంలో క్రీడాభివృద్ధికి మరో ముందడుగు పడింది. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌ కృషితో నియోజకవర్గంలో నూతన కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసి, యువ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించడమే లక్ష్యంగా ఈ అకాడమీ ఏర్పాటు కానుంది.

40 మంది క్రీడాకారులకు అవకాశం

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అకాడమీలో మొత్తం 40 మంది క్రీడాకారులకు అవకాశం కల్పించనున్నారు. ఇందులో 20 మంది బాలురు, 20 మంది బాలికలు ఉంటారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా కబడ్డీ శిక్షకులను నియమించనున్నారు. అలాగే వేర్వేరు వసతి నిర్వాహకులతో పాటు మైదాన సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, భద్రతా సిబ్బంది సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

మొత్తం ఎనిమిది సేవల నియామకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నియామకాలను పొరుగు సేవల విధానంలో చేపట్టనున్నారు.

గ్రామీణ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ

ఈ అకాడమీ అందుబాటులోకి వస్తే హుస్నాబాద్‌ నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల యువ క్రీడాకారులకు కబడ్డీలో శిక్షణ పొందేందుకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి. బాలురు, బాలికలకు సమానంగా అవకాశం కల్పించడం ద్వారా క్రీడల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు దోహదపడనుంది.

హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన క్రీడాకారులు ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి గుర్తింపు పొందారు. నూతన అకాడమీ ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి నాణ్యమైన శిక్షణ అందించి ఉన్నత స్థాయికి తీర్చిదిద్దేందుకు అవకాశం ఏర్పడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు సంబంధించి ఆర్థిక శాఖ జీవో ఆర్‌టీ నంబర్‌ 1660ను 2026 అక్టోబర్‌ 15న జారీ చేసినట్లు వివరాల్లో పేర్కొన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌ చొరవతో నియోజకవర్గంలో క్రీడాకారులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి రావడంపై విద్యార్థులు, యువత, స్థానిక క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.