- ధనలక్ష్మి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు.. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
నందికొట్కూరు, అక్టోబర్ 15 (చైతన్యగళం):
నందికొట్కూరులోని శ్రీ చక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఐదో రోజు అమ్మవారు ధనలక్ష్మి దేవిగా, ఉత్సవమూర్తి మధుర మీనాక్షి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు.
తెల్లవారుజామున 4.30 గంటలకు సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం వేదబ్రాహ్మణుల ఆధ్వర్యంలో పంచామృత, పంచద్రవ్యాలతో శ్రీ సూక్త విధానంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పూజలు, కలశ పూజలు నిర్వహించి మహా మంగళహారతి సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం భక్తుల కోసం అన్నప్రసాద వితరణ చేపట్టారు.
సాయంత్రం కుంకుమార్చన నిర్వహించిన అనంతరం పట్టణ ఆర్యవైశ్య మహిళల ఆధ్వర్యంలో వన్ మినిట్ ప్రోగ్రామ్తోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తి, ఆధ్యాత్మికతతోపాటు సాంస్కృతిక సందడితో ఆలయ ప్రాంగణం కళకళలాడింది.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భీమిశెట్టి జయరామకృష్ణ, బచ్చు శ్రీనివాసులు, విరబొమ్మ శ్రీనివాసులు, అరవేటి సుబ్రహ్మణ్యం, బద్రిశెట్టి సురేష్కుమార్, రాజా నాగేంద్ర ప్రసాద్, సర్విశెట్టి పార్థసారథి, మురారి ప్రవీణ్కుమార్, యువజన సంఘం అధ్యక్షుడు దొంతు నెహంత్, సతీష్ తదితర కమిటీ సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.