CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 6:21 pm Posted by : rakeshkashaveni12@gmail.com

ఆర్థిక పథకాలపై అవగాహనకు ప్రత్యేక శిబిరాలు 

సిద్ధిపేట, అక్టోబర్ 15 (చైతన్యగళం):

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రజలకు అందించడమే లక్ష్యంగా అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు సిద్ధిపేట జిల్లా వ్యాప్తంగా ఆర్థిక సమ్మిళిత పథకాల సంపూర్ణ అమలు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆవిష్కరించారు.

ఈ ప్రచారంలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల పరిధిలో బ్యాంకుల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన, సేవా శిబిరాలను నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన తదితర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన వారికి పథకాల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఆధార్ అనుసంధానం, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సేవలను కూడా అందించనున్నారు.

ప్రతి గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థ పరిధిలో కనీసం ఒక శిబిరాన్ని నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. అన్ని బ్యాంకులు, బ్రాంచ్ మేనేజర్లు, బ్యాంకు కరస్పాండెంట్లు, ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.

ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా బ్యాంకులు, సంబంధిత ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లీడ్ బ్యాంక్ కార్యాలయం విజ్ఞప్తి చేసింది.