- పరిపాలనలో పారదర్శకత, పనుల్లో వేగం పెంపునకు చర్యలు
కరీంనగర్ టౌన్, అక్టోబర్ 15 (చైతన్యగళం):
కరీంనగర్ నగరపాలక సంస్థలో పరిపాలనను మరింత పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించడంతో పాటు పనులను వేగవంతం చేసేందుకు ఈ-ఆఫీస్ విధానంపై బుధవారం ఆన్లైన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇంప్లిమెంటేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని సీడీఎంఏ కార్యాలయం నుంచి జూమ్ ద్వారా శిక్షణ అందించారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొని ఈ-ఆఫీస్ విధానంపై అవగాహన పెంపొందించుకున్నారు. సీడీఎంఏ కార్యాలయానికి చెందిన ఈ-ఆఫీస్ ప్రాజెక్ట్ అసోసియేట్ జి. మాలతి ఆన్లైన్ ద్వారా ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు.
ఈ-ఆఫీస్ విధానంలో దరఖాస్తుల పరిశీలన, పాత ఫైళ్లకు రసీదుల జత, కొత్త ఈ-ఫైళ్ల సృష్టి, నోటింగ్స్ నమోదు, లేఖలు, మెమోలు, సర్క్యులర్ల ముసాయిదాల తయారీ, అనుబంధ పత్రాల జత వంటి అంశాలను వివరించారు. ఫైళ్లను తదుపరి స్థాయి అధికారుల ఆమోదానికి పంపడం, డిజిటల్ సంతకాలతో సమర్పించడం, ఫైళ్ల స్థితిని తెలుసుకోవడం, వాటి వివరాలను పరిశీలించడం, ఈ-ఫైలింగ్, డిజిటల్ సంతకాల వినియోగం, వివిధ విభాగాల మధ్య ఫైళ్ల బదిలీ ప్రక్రియపై అవగాహన కల్పించారు.
ఈ విధానం ద్వారా కార్యాలయ కార్యకలాపాల్లో జాప్యాన్ని తగ్గించి, ఫైళ్ల పరిష్కారాన్ని వేగవంతం చేయవచ్చని శిక్షణలో వివరించారు. పౌర సేవలకు సంబంధించిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించేందుకు ఈ-ఆఫీస్ విధానం దోహదపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆయాజ్, ఉప కమిషనర్లు ఖాదర్ మొహియుద్దీన్, వేణుమాధవ్, సహాయ కమిషనర్ రాజమనోహర్, వివిధ విభాగాల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.