CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 2:12 pm Posted by : CHAITHANYA GALAM NEWS

శాకంబరీ అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు

  • అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు దంపతులు, రూరల్ సీఐ అంజలి

మహబూబాబాద్, అక్టోబర్ 14(చైతన్యగళం): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహిస్తున్న 25వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు శాకంబరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో శాకంబరీ అలంకరణను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ప్రకృతి ప్రసాదించిన పచ్చని కూరగాయలతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

శాకంబరీ దేవిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భక్తులు ప్రార్థించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరగా, ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిపారవశ్యంతో సాగాయి.

సాయంత్రం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఆయన సతీమణి సంధ్యారాణి, మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారికి ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.