హుస్నాబాద్, అక్టోబర్ 15(చైతన్యగళం):
హుస్నాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి మంజుల పాల్గొన్నారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు.ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ అతిపెద్ద పండుగల్లో ఒకటని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రకృతిలో లభించే వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆడపడుచులందరూ ఒక్కచోట చేరి సంతోషాల మధ్య పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని అన్నారు.తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు బతుకమ్మ పండుగ నిదర్శనమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో బతుకమ్మ సంబరాలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ఇలాంటి వేడుకలు దోహదపడతాయని తెలిపారు. పూల పరిమళాలు, మహిళల ఆటపాటలు, బతుకమ్మ పాటలతో కార్యక్రమ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్ పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ ,కౌన్సిలర్లు మెప్మా ప్రతినిధులు ఐసిడిఎస్ సిబ్బంది వివోలు మహిళా సంఘాల ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులుపాల్గొన్నారు.