CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 1:39 pm Posted by : CHAITHANYA GALAM NEWS

శ్రీదేవి యువసేన ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ

  • అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్‌ కేపీపీ చంద్ర

కరీంనగర్‌, అక్టోబర్‌ 14 (చైతన్యగళం):

కరీంనగర్‌ నగరంలోని ఎల్‌ఎండీ కాలనీలో శ్రీదేవి యువసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి. నిత్య పూజా కార్యక్రమాలతో ఉత్సవ ప్రాంగణం భక్తిపారవశ్యంతో నిండిపోయింది. ఇందులో భాగంగా బుధవారం ఎల్‌ఎండీ కాలనీలోని రామ్‌లీలా మైదానంలో భక్తుల కోసం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన కరీంనగర్‌ భాజపా కార్పొరేటర్‌ కేపీపీ చంద్ర శ్రీదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక భక్తులతో కలిసి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేపీపీ చంద్ర మాట్లాడుతూ.. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి యువసేన సభ్యులు నిష్ఠతో, భక్తిశ్రద్ధలతో అన్నప్రసాద వితరణ చేపట్టడం అభినందనీయమన్నారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో శ్రీదేవి యువసేన కుటుంబ సభ్యులు, నిర్వాహకులు కొత్తూరి శ్రీనివాస్‌, బట్టు కరుణాకర్‌, కడార్ల శ్రీనివాస్‌, ప్రదీప్‌, భవానీ దీక్షాపరులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.