- రోగులకు ఖర్చులపై ముందస్తు అవగాహన కల్పించాలి: బీజేపీ నాయకులు
మహబూబాబాద్, అక్టోబర్ 14(చైతన్యగళం): ఆసుపత్రులు, క్లినిక్లలో అందించే వైద్య సేవలు, వైద్య పరీక్షలు, చికిత్సలకు సంబంధించిన ధరల పట్టికను ప్రజలకు స్పష్టంగా కనిపించే ప్రదేశాల్లో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించడం రోగుల ప్రయోజనాలకు దోహదపడుతుందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కాచ్వాల్ శ్యామసుందర్ శర్మ, బీజేపీ జిల్లా నాయకులు డాక్టర్ ధరంసోత్ సీతారాం నాయక్ పేర్కొన్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పి.ఎస్. శ్రీవాస్తవ ఈ నెల 12న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో వైద్య సేవలు, సదుపాయాల ధరల వివరాలను స్పష్టంగా కనిపించే ప్రదేశాల్లో ప్రదర్శించే అంశంపై దృష్టి సారించాలని కోరినట్లు వారు తెలిపారు. సంబంధిత నిబంధనల ప్రకారం ధరల పట్టికను స్థానిక భాషతో పాటు ఆంగ్లంలోనూ అందుబాటులో ఉంచడం వల్ల రోగులకు సేవల ఛార్జీలపై స్పష్టత లభిస్తుందని అన్నారు.
సామాన్య ప్రజలు ఆసుపత్రులకు వెళ్లినప్పుడు వైద్య పరీక్షలు, చికిత్సలు, ఇతర ఆరోగ్య సేవలకు ఎంత ఖర్చవుతుందో ముందుగానే తెలుసుకునే అవకాశం ఉండాలని బీజేపీ నాయకులు అభిప్రాయపడ్డారు. ధరల వివరాలను ప్రదర్శించడం వల్ల రోగులు, వారి కుటుంబ సభ్యులు తమ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. వైద్య బిల్లుల విషయంలో అపోహలు, గందరగోళం, వివాదాలు తగ్గడంతో పాటు వైద్య రంగంలో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించడం, రోగుల ప్రయోజనాలను పరిరక్షించడం, వైద్య రంగంలో పారదర్శకతను బలోపేతం చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తోందని వారు పేర్కొన్నారు. కేంద్రం సూచించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.
రోగులు కూడా వైద్య సేవలు పొందే ముందు పరీక్షలు, చికిత్సలు, ఇతర సదుపాయాలకు సంబంధించిన ఛార్జీలను తెలుసుకోవాలని, బిల్లులు, చెల్లింపు రసీదులను భద్రపరచుకోవాలని సూచించారు. ధరల విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే ఆసుపత్రి యాజమాన్యాన్ని వివరణ కోరడంతో పాటు అవసరమైతే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు.
వైద్య సేవల ధరలపై స్పష్టమైన సమాచారం అందుబాటులో ఉండటం ద్వారా రోగులకు న్యాయం జరగడంతో పాటు ప్రజారోగ్య వ్యవస్థ మరింత బాధ్యతాయుతంగా మారుతుందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.