CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 7:55 am Posted by : CHAITHANYA GALAM NEWS

న్యాయ సేవలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి

  • పారా లీగల్ వాలంటీర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతి మురారి

మహబూబాబాద్, అక్టోబర్ 14(చైతన్యగళం):

సమాజంలోని నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందేలా పారా లీగల్ వాలంటీర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి పిలుపునిచ్చారు. న్యాయ సాయం అవసరమైన ప్రతి ఒక్కరికీ సంస్థ అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా కృషి చేయాలని సూచించారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం వివిధ లీగల్ ఎయిడ్ క్లినిక్‌లు, న్యాయ సహాయ కేంద్రాల్లో సేవలందిస్తున్న పారా లీగల్ వాలంటీర్లతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల పనితీరును రికార్డుల ఆధారంగా పరిశీలించడంతో పాటు, వాలంటీర్లతో ముఖాముఖి మాట్లాడి సేవల నిర్వహణకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు న్యాయ సహాయం అందించే క్రమంలో ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా పారా లీగల్ వాలంటీర్లు ఇప్పటివరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పరిష్కరించిన వివిధ సమస్యలు, సాధించిన విజయాలను వివరించారు. వారి అనుభవాలను తెలుసుకున్న స్వాతి మురారి, ప్రజలకు అందిస్తున్న సేవలను అభినందించారు.

న్యాయ సహాయం పొందలేని పేదలు, అణగారిన వర్గాలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అండగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ఉచిత న్యాయ సేవలు, లోక్ అదాలత్‌లు, న్యాయ సలహా కేంద్రాల ప్రాముఖ్యతను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందన్నారు. న్యాయ సేవలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వపరంగా అందుబాటులో ఉన్న న్యాయ సహాయాన్ని చేరువ చేయాలని సూచించారు. బాధితుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ మరింత అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.