CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 7:54 am Posted by : CHAITHANYA GALAM NEWS

శ్రీ ఉమా చంద్ర మౌళిశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు

  • భక్తిశ్రద్ధలతో చండీ యాగం, అన్నపూర్ణాదేవి అలంకరణ.. ప్రత్యేక పూజలు

మహబూబాబాద్, అక్టోబర్ 14(చైతన్యగళం):

మహబూబాబాద్ పట్టణంలోని స్టేషన్ రోడ్డులో ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన శ్రీ ఉమా చంద్ర మౌళిశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారికి విశేష పూజలు, యాగాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు చండీ యాగం, మహా పూర్ణాహుతి కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులు స్వయంగా అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అన్నపూర్ణాదేవి అలంకరణ, అన్నపూర్ణాదేవి మూల హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అలాగే 18 నిమ్మకాయ ముక్కలతో సర్పదోష నివారణార్థం ప్రత్యేక కుంకుమార్చన పూజ నిర్వహించారు.

సాయంత్రం 6 గంటలకు సౌందర్యలహరి, లలితా సహస్రనామ పారాయణం భక్తిప్రపత్తులతో నిర్వహించారు. అనంతరం దుర్గాదేవికి సువాసిని పూజ, ఐదు చీరల లక్కీ డ్రా, ఒక వెండి నాణెం లక్కీ డ్రా కార్యక్రమాలు నిర్వహించారు. పంచహారతులు, పవళింపు సేవతో ఆ రోజు ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. సత్యనారాయణ మాట్లాడుతూ.. దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు, వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

అనంతరం ఆలయ అర్చకులు యుగేందర్ శర్మ మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం ద్వారా ఆధ్యాత్మిక చింతన పెంపొందడంతో పాటు మనసుకు ప్రశాంతత చేకూరుతుందని తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలు, హోమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని సూచించారు.