CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 10:12 pm Posted by : rakeshkashaveni12@gmail.com

ఓటరు నమోదుకు మరో అవకాశం.. 15, 16 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు

సిద్దిపేట, అక్టోబర్ 14 (చైతన్యగళం):

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 32-హుస్నాబాద్, 33-సిద్దిపేట, 41-దుబ్బాక, 42-గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు లేని అర్హులైన పౌరులు, తొలిసారిగా ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునే 18 ఏళ్లు నిండిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. గతంలో గైర్హాజరు, వలస, మరణం, డూప్లికేట్ నమోదు వంటి కారణాలతో ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించబడిన వారు తమ అర్హతను పరిశీలించుకోవాలని తెలిపారు. ఓటరుగా నమోదు కావడానికి అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు పేరు నమోదు చేసుకోని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

ఈ ప్రత్యేక శిబిరాల్లో ఫారం-6 సమర్పించిన అర్హులైన అభ్యర్థుల వివరాలను నవంబర్ 9న ప్రచురించే తుది ఓటరు జాబితాలో చేర్చేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. శిబిరాల నిర్వహణ కోసం సంబంధిత బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని, ఓటరు నమోదు ప్రక్రియలో ప్రజలకు సహకరిస్తారని తెలిపారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కూడా శిబిరాల్లో పాల్గొనాలని కోరారు.

అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో ఉండాలని, అనర్హుల పేర్లు జాబితాలో ఉండకూడదనే లక్ష్యంతో ఈ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రజలు తమ ఓటరు వివరాలను పరిశీలించుకొని, అర్హత ఉన్నవారు నిర్ణీత తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.