CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 12:30 pm Posted by : CHAITHANYA GALAM NEWS

22, 23వ వార్డుల్లో పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించాలి

  • వీధిలైట్లు ఏర్పాటు చేసి, పిచ్చి మొక్కలు తొలగించాలి
  • కలెక్టర్ కార్యాలయంలో ఏఓకు సీపీఐ నాయకుల వినతి

మహబూబాబాద్(చైతన్యగళం): పట్టణంలోని 22, 23వ వార్డుల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి వీధిలైట్లు ఏర్పాటు చేయాలని సీపీఐ పార్టీ వార్డు కమిటీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏఓకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సీపీఐ పార్టీ పట్టణ సహాయ కార్యదర్శి చింతకుంట్ల వెంకన్న మాట్లాడుతూ.. 22, 23వ వార్డుల్లో పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా 23వ వార్డులోని బాబాగుట్ట వెనుక భాగంలో ఉన్న సింగు నర్సయ్య సీపీఐ కాలనీలో గత ఏడాది కాలంగా రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించకపోవడంతో విషసర్పాల సంచారం పెరిగి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పండుగల సమయంలోనూ వీధిలైట్లు ఏర్పాటు చేయకపోవడంతో పలు కాలనీలు చీకటిమయంగా మారుతున్నాయని తెలిపారు. సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినా స్పందన లేదని, గతంలో ఆందోళనలు చేపట్టినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కొండపల్లి గోపాల్‌రావు నగర్ కాలనీ, సింగు నర్సయ్య కాలనీ, దాసరి వెంకటరాములు కాలనీ, ఎన్జీవోస్ కాలనీ, మాస బత్తిని వెంకటమల్లు కాలనీ, 551 మిలిటరీ కాలనీల్లో పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించి వీధిలైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఎస్సీ, హిందూ, ముస్లిం, మార్వాడీ శ్మశానవాటికల వరకు ఉన్న ప్రాంతాల్లోనూ పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించకపోవడం బాధాకరమని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ శాఖల కార్యదర్శులు నాగెల్లి యాకమ్మ, ఎర్రోజు పద్మ, బల్లెం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.