- చండీయాగం, హోమాలు, సువాసిని పూజలో పాల్గొన్న భక్తులు
మహబూబాబాద్, అక్టోబర్ 12(చైతన్యగళం): మహబూబాబాద్ పట్టణంలోని శ్రీ ఉమా చంద్ర మౌళిశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు, చండీయాగం, హోమాలు, పారాయణాలు నిర్వహించారు. ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
సోమవారం ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణల నడుమ చండీయాగం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 గంటలకు భక్తులు స్వయంగా శ్రీ దుర్గాదేవికి అభిషేకాలు నిర్వహించారు. చతుష్షష్టి పూజ, గాయత్రీ దేవి మూలమంత్ర హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. చండీయాగంలో పాల్గొన్న దంపతులకు అమ్మవారి అన్నప్రసాదాన్ని అందజేశారు.
సాయంత్రం 6 గంటలకు సౌందర్యలహరి, లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. రాత్రి 7.30 గంటలకు మహిళా భక్తులు స్వయంగా అమ్మవారికి సువాసిని పూజలు చేసి తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, సకల శుభాలు కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా భక్తుల కోసం నిర్వహించిన లక్కీ డ్రాలో ఐదు చీరలు, ఒక వెండి నాణెం విజేతలకు అందజేశారు. రాత్రి 8 గంటలకు పంచహారతులు సమర్పించి, అనంతరం అమ్మవారి పవళింపు సేవ నిర్వహించారు. చివరగా భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) నిడిగొండ సత్యనారాయణ మాట్లాడుతూ… దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలను భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు, యాగాలు, పారాయణాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఆలయ అర్చకులు యుగేందర్ శర్మ మాట్లాడుతూ… శరన్నవరాత్రుల్లో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం విశేష పుణ్యప్రదమని తెలిపారు. చండీయాగం, హోమాలు, మంత్ర పారాయణాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. భక్తులు మనస్సును అమ్మవారిపై నిలిపి పూజలు చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక చైతన్యం పొందవచ్చని తెలిపారు.
దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. అమ్మవారి నామస్మరణలు, వేదమంత్రోచ్ఛారణలతో దేవస్థానంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయ నిర్వాహకులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.