CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 12:24 pm Posted by : CHAITHANYA GALAM NEWS

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి సేవలో కౌన్సిలర్ చిదిరాల అరుణ దంపతులు

  • శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు.. అమ్మవారి ఆశీస్సులు పొందిన 19వ వార్డు కౌన్సిలర్ దంపతులు

మహబూబాబాద్(చైతన్యగళం): పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మహబూబాబాద్ మున్సిపాలిటీ 19వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి చిదిరాల అరుణ–జ్ఞానేశ్వర్ దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా చిదిరాల అరుణ–జ్ఞానేశ్వర్ దంపతులు మాట్లాడుతూ.. శరన్నవరాత్రులు అమ్మవారి ఆరాధనకు, ఆధ్యాత్మిక చింతనకు, భక్తిభావాన్ని పెంపొందించుకోవడానికి ఎంతో విశిష్టమైనవని అన్నారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని, ప్రతి కుటుంబంలో సిరిసంపదలు, ఆనందం నిండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. భక్తులంతా ఐకమత్యంతో ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని కోరారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ పట్టణంతో పాటు జిల్లా ప్రజలందరికీ శ్రీ శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు.