- అగ్నిమాపక సిబ్బందితో సమన్వయం చేసి మంటలను అదుపు చేసిన ప్రఫుల్ దేశాయ్
- పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
కరీంనగర్, అక్టోబర్ 13 (చైతన్యగళం):
కరీంనగర్ నగరంలోని డంపింగ్ యార్డులో తలెత్తిన మంటలు, పొగ సమస్యను పరిష్కరించేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ చర్యలు చేపట్టారు. మంగళవారం అధికారులతో కలిసి డంపింగ్ యార్డును సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు.
డంపింగ్ యార్డులో అక్కడక్కడా కనిపించిన మంటలు, వెలువడుతున్న పొగను తనిఖీ చేశారు. అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేస్తూ అక్కడే ఉండి నగరపాలక సంస్థ సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని మంటలను ఆర్పించే చర్యలను పర్యవేక్షించారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. డంపింగ్ యార్డులో మంటలు చెలరేగకుండా, పొగ వెలువడకుండా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
బయోమైనింగ్ ప్రక్రియతో చెత్త తగ్గింపునకు చర్యలు
ఈ సందర్భంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.. నగర పారిశుద్ధ్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణకు నగరపాలక సంస్థ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. డంపింగ్ యార్డులో సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటికే బయోమైనింగ్ ప్రక్రియ ద్వారా పేరుకుపోయిన చెత్తను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు బయోమైనింగ్ యంత్రాలను మరిన్ని ఏర్పాటు చేసి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ తనిఖీలో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు.