- శక్తి సదన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. మహిళలకు నూతన వస్త్రాల పంపిణీ
కరీంనగర్, అక్టోబర్ 13 (చైతన్యగళం):
బతుకమ్మ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి యశ్వంత్ సింగ్ అన్నారు. ప్రకృతి పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో నిర్వహిస్తున్న శక్తి సదన్‌లో మంగళవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన యశ్వంత్ సింగ్ మహిళలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని తెలిపారు. ప్రకృతిని ఆరాధిస్తూ, మహిళల ఐక్యతను చాటిచెప్పే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిలో విశిష్ట స్థానం కలిగి ఉందన్నారు.
ప్రకృతి పర్యావరణ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి మూగ జయశ్రీ సౌజన్యంతో శక్తి సదన్‌లోని మహిళలకు యశ్వంత్ సింగ్ నూతన వస్త్రాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు, న్యాయవాది ఎ. కిరణ్‌కుమార్, శక్తి సదన్ పర్యవేక్షకురాలు ఎ. రమాదేవి, కార్యాలయ నిర్వాహకులు రజిత, వసంత, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.