CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 7:31 am Posted by : CHAITHANYA GALAM NEWS

నవ్య కళానికేతన్‌ ఆధ్వర్యంలో ఘనంగా ‘స్వరరాగ సుధా’

  • పాత మధుర గీతాలతో సంగీత ప్రియులను అలరించిన గాయనీ గాయకులు

మిర్యాలగూడ (చైతన్యగళం): నవ్య కళానికేతన్‌ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీనివాస కల్చరల్‌ ఏసీ మినీ స్టూడియోలో నిర్వహించిన ‘స్వరరాగ సుధా’ సంగీత కార్యక్రమం ఆహ్లాదకరంగా సాగింది. గాయనీ గాయకులు పాత మధుర గీతాలను ఆలపించి సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేశారు. తమ గానంతో ప్రేక్షకులను అలరించి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా కళాకారులను ప్రోత్సహిస్తున్న న్యాయవాదులు పేదబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌, మట్టపల్లి రామచంద్రయ్య, అలుగుబెల్లి భూపతిరెడ్డిలను ఘనంగా సన్మానించారు. మిర్యాలగూడ బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు నేతి సత్యనారాయణ జన్మదిన వేడుకలను నిర్వహించారు. గాయనీ గాయకులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు.

సంగీత, సాంస్కృతిక రంగాలకు నవ్య కళానికేతన్‌ అందిస్తున్న సేవలను న్యాయవాదులు కొనియాడారు. సంస్థ అధ్యక్షుడు తడకమల్ల రామా రంగారావు మాట్లాడుతూ, మిర్యాలగూడలోని ప్రతిభావంతులైన గాయనీ గాయకులను ప్రోత్సహించడం, కళారంగానికి సేవలందించడం సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కందుకూరి సుదర్శన్‌, దాసరాజు రమణ కుమార్‌, హెచ్చు రవి, కంబాల శ్రీనివాస్‌, గాయనీమణులు శ్రీరాణి, రజిని, హరిచందన, మౌనిక, కేంద్ర ప్రభుత్వ న్యాయవాది ధూపాటి మట్టయ్య, బార్‌ అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి రాయారపు భాస్కర్‌ నాయుడు, డి. రాజశేఖర్‌ నాయక్‌, బంటు మోహన్‌, శీలం వీరేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు.

కళాకారులను ప్రోత్సహిస్తూ సంగీత, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పిన ‘స్వరరాగ సుధా’ కార్యక్రమం ఆద్యంతం సంగీతానురాగులను ఆకట్టుకుంది.