- పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి
- పోలీస్ అధికారులకు కమిషనర్ గౌస్ ఆలం దిశానిర్దేశం
కరీంనగర్, అక్టోబర్ 12 (చైతన్యగళం): శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ నేరాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు సత్వర న్యాయం అందేలా కృషి చేయాలని సూచించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం సెప్టెంబర్ నెల నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతలు, కేసుల పురోగతి, రాబోయే పండుగల బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించారు.
పండుగల బందోబస్తుకు పకడ్బందీ ఏర్పాట్లు
దుర్గామాత నిమజ్జనోత్సవం, దసరా వేడుకల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని కమిషనర్ సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచి, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం
మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తులో ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

కొత్త చట్టాల అమలుపై సమీక్ష
నూతన నేర న్యాయ చట్టాల అమలు, ఆన్‌లైన్ ఎఫ్‌ఐఆర్‌లు, ఈ-సమ్మన్లు, ఈ-సాక్ష్య అనువర్తనాల వినియోగం, సీసీటీఎన్‌ఎస్ 2.0 వ్యవస్థ పనితీరును సమీక్షించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకుంటూ దర్యాప్తులో నాణ్యతను పెంచాలని అధికారులకు సూచించారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
పెరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని కమిషనర్ ఆదేశించారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు సహాయం అందించేందుకు సీఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా ఫోన్లను గుర్తించి తిరిగి అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు
గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యం అక్రమ తరలింపు, ఇసుక అక్రమ రవాణా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ప్రజావాణి, ఆన్‌లైన్ వినతుల ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించి పారదర్శకమైన పోలీసు సేవలు అందించాలని పేర్కొన్నారు. డయల్ 100, 112 ద్వారా వచ్చే ఫిర్యాదులపై సిబ్బంది తక్షణమే స్పందించాలన్నారు.
ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రోత్సాహకాలు
ఆస్తి సంబంధిత నేరాలు, సంచలనాత్మక కేసులను ఛేదించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు పోలీసు అధికారులు, సిబ్బందికి కమిషనర్ ప్రశంసాపత్రాలు, రివార్డులు అందజేసి అభినందించారు.
ఈ సమావేశంలో ఏసీపీలు శ్రీనివాస్, జి. వెంకటస్వామి, విజయకుమార్, యాదగిరిస్వామి, స్వామి, శ్రీనివాస్, మాధవి, వాసాల సతీష్‌తో పాటు వివిధ పోలీస్ స్టేషన్ల స్టేషన్ హౌస్ అధికారులు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.