CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 10:15 pm Posted by : CHAITHANYA GALAM NEWS

గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

  • టవర్‌ సర్కిల్‌ లేబర్‌ అడ్డా వద్ద ఎక్సైజ్‌ అధికారుల దాడులు
  • 168 చాక్లెట్లు స్వాధీనం.. మొత్తం బరువు 908 గ్రాములు

కరీంనగర్‌, అక్టోబర్‌ 12 (చైతన్యగళం): కరీంనగర్‌ నగరంలోని టవర్‌ సర్కిల్‌ లేబర్‌ అడ్డా వద్ద గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లింగంపల్లి నరేశ్‌ను అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి 168 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం బరువు 908 గ్రాములుగా అధికారులు తెలిపారు.

జిల్లా డివిజన్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ రవికుమార్‌, జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి సంతోష్‌ ఆదేశాల మేరకు డీటీఎఫ్‌ కరీంనగర్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ జి. దుర్గాభవాని ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన లింగంపల్లి నరేశ్‌ (తండ్రి బాలయ్య)ను అదుపులోకి తీసుకున్న అధికారులు, స్వాధీనం చేసుకున్న గంజాయి చాక్లెట్లతో పాటు అతడిని కరీంనగర్‌ అర్బన్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

మాదకద్రవ్యాల విక్రయాలపై కఠిన చర్యలు

ఈ సందర్భంగా సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ జి. దుర్గాభవాని మాట్లాడుతూ.. గంజాయిని విక్రయించడం, సరఫరా చేయడం, అక్రమంగా కలిగి ఉండటం చట్టరీత్యా నేరమని తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలకు సహకరించే వారిపైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల అక్రమ విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.

ఈ దాడుల్లో హెడ్‌ కానిస్టేబుల్‌ పి. రవికుమార్‌, కానిస్టేబుళ్లు జి. రాజు, బి. రాజేందర్‌, జె. సతీష్‌, అక్షర, డ్రైవర్‌ ఎస్‌. గోపి పాల్గొన్నారు.