- 30 కిలోమీటర్ల పరుగు పూర్తి చేసిన కోహెడ ఉపాధ్యాయులు
హుస్నాబాద్/కోహెడ, అక్టోబర్ 11 (చైతన్య గళం): ఉపాధ్యాయ వృత్తిని నిర్వహిస్తూనే పరుగుల పోటీల్లో పాల్గొంటూ క్రీడాస్ఫూర్తిని చాటుతున్నారు కోహెడ మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు కొండమీది హరిప్రసాద్, అమ్మిగల్ల రమేష్. మంచిర్యాల జిల్లాలోని కవ్వాల్ పులుల అభయారణ్య అటవీ ప్రాంతంలో నిర్వహించిన అటవీ పునరుద్ధరణ పరుగు పోటీలో వీరిద్దరూ 30 కిలోమీటర్ల పరుగును విజయవంతంగా పూర్తి చేశారు.
దట్టమైన అడవులు, ఎత్తుపల్లాలతో కూడిన క్లిష్టమైన మార్గంలో ప్రకృతి ఒడిలో పరుగెత్తి తమ పట్టుదల, శారీరక దృఢత్వాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా సుమారు 700 మీటర్ల ఎత్తులో ఉన్న చారిత్రక గాంధారి ఖిల్లాను కాలినడకన అధిరోహించి తమ సాహసాన్ని ప్రదర్శించారు.
ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూనే 2020 నుంచి తెలంగాణలో నిర్వహిస్తున్న వివిధ మారథాన్ పోటీల్లో పాల్గొంటూ తమ క్రీడా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పరుగు పోటీలో గోవా, చెన్నై, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఆస్ట్రేలియా, జర్మనీకి చెందిన వారు పాల్గొనడం విశేషం.
కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న ప్రతి ఒక్కరి పేరుతో గాంధారి వనంలో ఒక మొక్కను నాటడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అటవీ పరిరక్షణ, పర్యావరణంపై అవగాహన పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలికి పరుగు ఎంతగానో దోహదపడుతుందని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. విధి నిర్వహణతో పాటు క్రీడలకూ సమయం కేటాయిస్తూ ముందుకు సాగుతున్న కోహెడ ఉపాధ్యాయులు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.