- ప్రత్యేక పూజలు, చండీయాగం, హోమాలతో ఆధ్యాత్మిక శోభ
మహబూబాబాద్, అక్టోబర్ 11(చైతన్యగళం): శ్రీ ఉమా చంద్ర మౌళీశ్వర స్వామి దేవస్థానంలో దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు శ్రీ దుర్గా అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు, చండీయాగం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఉదయం గణపతి పూజతో కార్యక్రమాలను ప్రారంభించి కలశ స్థాపన, సర్వతోభద్ర మండప ఆరాధన, కంకణధారణ, అఖండ దీపారాధన నిర్వహించారు. అనంతరం భక్తులు స్వయంగా శ్రీ దుర్గా అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని విశేషంగా అలంకరించి చతుఃషష్టి పూజ నిర్వహించారు. అనంతరం చండీయాగం, బాలా త్రిపుర సుందరి మూలమంత్ర హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
అనంతరం 18 నిమ్మకాయ ముక్కలతో సర్పదోష కుంకుమార్చన నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారి నిత్యపూజలు, హోమం, చండీయాగం, ఇతర సేవల్లో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం సౌందర్యలహరి, లలితా సహస్రనామ పారాయణం నిర్వహించగా, రాత్రి సర్పదోష కుంకుమార్చన, దుర్గా అమ్మవారికి సువాసినీ పూజ, పంచహారతులు నిర్వహించారు. అనంతరం పవళింపు సేవతో పాటు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా వేద పండితులు యుగేందర్ శర్మ మాట్లాడుతూ, దుర్గా శరన్నవరాత్రులు అమ్మవారి ఆరాధనకు అత్యంత విశిష్టమైనవని తెలిపారు. నవరాత్రుల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. దేవస్థానంలో నిర్వహించే ప్రత్యేక పూజలు, హోమాలు, చండీయాగంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవస్థానంలో ప్రతిరోజూ ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.