CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 11:11 am Posted by : CHAITHANYA GALAM NEWS

ఎస్వీ టవర్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పూల పండుగలో మహిళల సందడి!

మహబూబాబాద్(చైతన్యగళం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకర్ బోర్డు ప్రాంతంలో ఉన్న ఎస్వీ టవర్స్‌లో మహిళలు ఉత్సాహంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు ఒక్కచోట చేరి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. పూల పండుగతో ఎస్వీ టవర్స్ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.

ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐకమత్యానికి, ప్రకృతి ప్రేమకు ప్రతీక అని అన్నారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ చేరి పాటలు పాడటం, ఆడిపాడటం మన సంస్కృతిలో ప్రత్యేకమైన సంప్రదాయమని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ పండుగ విశిష్టతను భావితరాలకు తెలియజేస్తూ, మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

బతుకమ్మ వేడుకలు మహిళల్లో ఆనందాన్ని, పరస్పర ఆత్మీయతను పెంపొందిస్తాయని తెలిపారు. ఇలాంటి పండుగలను అందరూ కలిసికట్టుగా జరుపుకోవడం ద్వారా తెలంగాణ సంస్కృతిని మరింతగా చాటిచెప్పవచ్చని అన్నారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొనడంతో ఎస్వీ టవర్స్‌లో బతుకమ్మ సంబరాలు సందడిగా సాగాయి.