CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 11:29 am Posted by : CHAITHANYA GALAM NEWS

ఆరోగ్య నియమాలు పాటిస్తూ ఆసుపత్రులకు దూరంగా ఉండాలి – నిమ్స్‌ డైరెక్టర్‌ ఇన్‌చార్జి మార్త రమేష్‌

హుస్నాబాద్‌,అక్టోబర్ 9(చైతన్యగళం):

ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడం, ఆహారపు అలవాట్లలో మార్పుల ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతోపాటు సమాజసేవ, సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలనే ఉద్దేశంతో హుస్నాబాద్‌ పట్టణంలోని శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయ ప్రాంగణంలో హుస్నాబాద్ పద్మశాలి కుల బంధువుల ఆత్మీయ సమావేశంలో నిమ్స్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ ఇన్‌చార్జి మార్త రమేష్‌ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ప్రతి ఒక్కరూ ఆరోగ్య నియమాలు పాటించాలని, వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చికిత్స కంటే వ్యాధుల నివారణే ముఖ్యమని, ఆహారపు అలవాట్లు, దైనందిన జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు. వ్యక్తిగత ఆరోగ్యంతోపాటు సమాజ శ్రేయస్సుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సేవాభావానికి ఘన సన్మానం…

వైద్య వృత్తిలో కొనసాగుతూ సామాజిక సేవ పట్ల ప్రత్యేక ఆసక్తి కనబరిచిన మార్త రమేష్‌ వివిధ రంగాల్లో అందించిన సేవలను ఈ సందర్భంగా హుస్నాబాద్ పద్మశాలి సంఘం నాయకులు కొనియాడారు. నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, పోపా రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం సలహాదారుగా, హెల్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ లీడర్‌షిప్‌ ప్లాట్‌ఫామ్‌ అధ్యక్షుడిగా, నిమ్స్‌ హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడిగా ఆయన నిర్వహించిన బాధ్యతలను గుర్తుచేశారు. వైద్య సేవలతోపాటు సామాజిక, సంస్థాగత రంగాల్లో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు బూర్ల రాజయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ సతీష్‌, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్డేపల్లి వెంకటరమణ ,పద్మశాలి సేవా సంఘం నాయకులు వడ్డేపల్లి అరుణ, పంతం కన్యాకుమారి, వడ్డేపల్లి లక్ష్మయ్య, చింతకింది శ్రీనివాస్‌, బాలయ్య, వెంకట్‌ నారాయణ, సత్యనారాయణ, కనకయ్య, నాగభూషణం, మల్లేశం, భాస్కర్‌, కోమటి నారాయణ, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.