CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 11:24 am Posted by : CHAITHANYA GALAM NEWS

అంతర్జాతీయ చెస్‌ పోటీలకు ఎంపికైన శివాంశికకు మంత్రి పొన్నం అభినందనలు

  • జాతీయ స్థాయిలో రజత పతకంతో సత్తా చాటిన క్రీడాకారిణికి సత్కారం

హుస్నాబాద్‌ , అక్టోబరు 9 (చైతన్యగళం):

జమ్మూలో నిర్వహించిన అండర్‌-17 జాతీయ స్థాయి చెస్‌ పోటీల్లో రజత పతకం సాధించి, ప్రపంచ యువ కామన్వెల్త్‌ పోటీలకు ఎంపికైన చెస్‌ క్రీడాకారిణి, డబ్ల్యూసీఎం, డబ్ల్యూఎఫ్‌ఎం బిరుదులు పొందిన శివాంశికను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అభినందించి సత్కరించారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఈ కార్యక్రమం జరిగింది.

చిన్న వయసులోనే చెస్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో రజత పతకం సాధించడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు.

భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని శివాంశికను మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆకాంక్షించారు. తన ప్రతిభతో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి, యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలవాలని అభిలషించారు.