CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 11:38 am Posted by : CHAITHANYA GALAM NEWS

పంట పండిస్తే దొంగల పాలు.. కన్నీరుమున్నీరైన కర్షకుడు!

  • మొక్కజొన్న చేనులో కంకుల చోరీ.. అర ఎకరా పంటకు నష్టం
  • నీటి ఎద్దడిని తట్టుకొని సాగు చేస్తే.. చేతికొచ్చే వేళ దొంగల దెబ్బ!

గడివేముల(చైతన్యగళం): ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతుకు చివరకు కన్నీరే మిగిలింది. ఎండలు, నీటి కొరతను తట్టుకొని పంటను కాపాడుకుంటూ వచ్చిన అన్నదాతకు గుర్తుతెలియని వ్యక్తులు కోలుకోలేని దెబ్బ తీశారు. నంద్యాల జిల్లా గడివేముల మండలం బిలకల గూడూరు గ్రామానికి చెందిన కురువ వేణుమాధవ్‌ సాగు చేసిన మొక్కజొన్న పంటలో కంకులను దొంగిలించడంతో తీవ్రంగా నష్టపోయారు. కష్టపడి పండించిన పంటను కళ్లముందే కోల్పోయానని ఆయన కన్నీరుమున్నీరవుతున్నారు.

రాత్రికి రాత్రే కంకుల మాయం!

బిలకల గూడూరు నుంచి రేగడ గూడూరు వెళ్లే మార్గంలోని సర్వే నంబరు 83లో వేణుమాధవ్‌ ఒకటిన్నర ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. పంట చేతికొచ్చే దశలో ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు గురువారం రాత్రి పొలంలోకి ప్రవేశించి సుమారు అర ఎకరాకు చెందిన మొక్కజొన్న కంకులను కోసుకెళ్లినట్లు బాధిత రైతు తెలిపారు. తెల్లవారేసరికి పంటకు నష్టం జరిగిన విషయం గుర్తించి ఆవేదనకు గురయ్యారు.

కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే!

ఇప్పటికే ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరతను ఎదుర్కొంటూ పంటను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నానని వేణుమాధవ్‌ వాపోయారు.

పెట్టుబడులు పెట్టి, రెక్కలు ముక్కలు చేసుకొని సాగు చేసిన పంటను దొంగలు ఎత్తుకెళ్లడంతో తన శ్రమంతా వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట దిగుబడిపై ఆశలు పెట్టుకున్న సమయంలో ఈ ఘటన జరగడం తన కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిందని కన్నీటిపర్యంతమయ్యారు.

అధికారులు స్పందించేనా?

రైతు కష్టాన్ని గుర్తించి సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని బాధితుడు కోరుతున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ప్రకృతి పరిస్థితులతో సతమతమవుతున్న రైతులకు ఇలాంటి ఘటనలు మరింత భారంగా మారుతున్నాయని, తనకు న్యాయం చేసి నష్టాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని వేణుమాధవ్‌ వేడుకున్నారు.