CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 11:14 am Posted by : CHAITHANYA GALAM NEWS

రైతుల విద్యుత్‌ సమస్యలపై బీఆర్‌ఎస్‌ ధర్నా

  • అక్కన్నపేట విద్యుత్‌ ఉపకేంద్రం ఎదుట ఆందోళన.. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించాలని డిమాండ్‌

హుస్నాబాద్‌ , అక్టోబరు 9 (చైతన్యగళం): అక్కన్నపేట మండలంలో రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని విద్యుత్‌ ఉపకేంద్రం ఎదుట ధర్నా నిర్వహించారు. హుస్నాబాద్‌ మాజీ శాసనసభ్యుడు వొడితెల సతీష్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఈ ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ నాయకత్వంలో రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించామని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడంలో విఫలమవుతోందని ఆరోపించారు. కనీసం ఆరు గంటల పాటు కూడా నిరంతరాయంగా విద్యుత్‌ అందని పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు.

రైతులు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన మొక్కజొన్న, పత్తి పంటలను కాపాడేందుకు అవసరమైన విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్‌ సమస్యలను వెంటనే పరిష్కరించి, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ అందించాలని కోరుతూ హుస్నాబాద్‌ విద్యుత్‌ శాఖ సహాయ విభాగాధికారికి వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో అక్కన్నపేట మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పెసరు సాంబరాజు, మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు లింగాల సాయన్న, కాసర్ల అశోక్‌బాబు, మాజీ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు, పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.