CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 10:28 pm Posted by : rakeshkashaveni12@gmail.com

పత్తి కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి – అదనపు కలెక్టర్

కరీంనగర్ అక్టోబర్ 09 (చైతన్యగళం)

2026–27 పత్తి మార్కెటింగ్ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, సీసీఐ, జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు కనీస మద్దతు ధర, పత్తి నాణ్యత ప్రమాణాలు, కొనుగోలు నిబంధనలు, కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ విధానంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. రైతు వేదికల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల్లో తూనిక యంత్రాల తనిఖీలు, అగ్నిమాపక పరికరాల పనితీరును పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లకు అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు, ఆధార్ ధ్రువీకరణ పరికరాలను మిల్లుల యజమానులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. రైతులకు సకాలంలో కొనుగోలు సదుపాయం కల్పించేందుకు గుర్తించిన అన్ని జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు ప్రారంభించేలా సీసీఐ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

కౌలు రైతుల నమోదు, లాగిన్ ఐడీల వినియోగంపై వ్యవసాయ విస్తరణ అధికారులకు శిక్షణ అందించాలని తెలిపారు. పత్తి కొనుగోళ్ల సమయంలో జిన్నింగ్ మిల్లులను పర్యవేక్షణ బృందాలు తనిఖీ చేస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పత్తి గింజలు, పత్తి బేళ్ల రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా రవాణా, పోలీస్, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

మరణించిన రైతులు, ఎన్‌ఆర్‌ఐ రైతుల నమోదు, ఆధార్ ధ్రువీకరణలో ఎదురవుతున్న సమస్యలను వ్యవసాయ విస్తరణ అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. వీటి పరిష్కారానికి ఉన్నతాధికారుల నుంచి మార్గదర్శకాలు పొందే అంశాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు. రైతులకు పారదర్శకమైన సేవలు అందిస్తూ పత్తి కొనుగోళ్లను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ సూచించారు.