CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 11:06 pm Posted by : CHAITHANYA GALAM NEWS

శ్రీ చైతన్యలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

  • తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలు

మహబూబాబాద్(చైతన్యగళం):

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహబూబాబాద్‌లోని శ్రీ చైతన్య పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో విద్యార్థులు పేర్చిన బతుకమ్మలు, వారి ఆటపాటలు, నృత్యాలతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.

విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ షేక్ మదార్ తెలిపారు. చదువుతోపాటు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల రంగురంగుల పూలతో ఆకర్షణీయమైన బతుకమ్మలను తయారు చేశారు. అనంతరం వాటి చుట్టూ చేరి సంప్రదాయ గీతాలు ఆలపిస్తూ, లయబద్ధంగా నృత్యాలు చేశారు. చిన్నారుల ఉత్సాహభరితమైన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాల ఆవరణలో పండుగ సందడి నెలకొంది.

ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యాసంస్థల తెలంగాణ చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డీజీఎం చేతన్ మాధుర్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులకు ముందస్తు దసరా, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ విద్యాసాగర్, సీ-బ్యాచ్ ఇన్‌చార్జి మల్లేశం, ప్రాథమిక విభాగం ఇన్‌చార్జి ప్రవల్లిక, ప్రీ-ప్రైమరీ ఇన్‌చార్జి షహనాజ్, ఏఓ సుధాకర్, పీఈటీలు యాకయ్య, రాకేష్, ప్రియాంక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.