- సాగర్, శ్రీశైలం నుంచి సాగునీరు విడుదల చేయాలి: టీడీపీ నాయకుడు పోగుల సైదులు గౌడ్
నల్గొండ, అక్టోబరు 9 (చైతన్యగళం): రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పగటిపూట కనీసం 12 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు పోగుల సైదులు గౌడ్ డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని వినియోగించి, నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని పంటలను కాపాడేందుకు సాగునీరు విడుదల చేయాలని కోరారు.
విద్యుత్ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో రైతులకు అందిస్తున్న తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని అన్నారు. తక్కువ వోల్టేజీ కారణంగా విద్యుత్ సరఫరా తరచూ నిలిచిపోతుండటంతో మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి, నాణ్యమైన విద్యుత్‌తో పాటు సాగునీరు అందించి రైతుల పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.