కరీంనగర్, అక్టోబర్ 8 (చైతన్యగళం):
ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో ఏర్పడే నీటి ఎద్దడిని ఎదుర్కోవడంతో పాటు భూగర్భ జలాలను పెంపొందించేందుకు రైన్‌వాటర్ హార్వెస్టింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల అధికారులతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టే విధానంలో భాగంగా రైన్‌వాటర్ హార్వెస్టింగ్, రూఫ్‌టాప్ రైన్‌వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాట్లు, స్థలాల గుర్తింపు, ప్రణాళిక సిద్ధం తదితర అంశాలపై చర్చించారు. నగరంలోని అన్ని డివిజన్లలో వర్షపు నీటిని నిల్వ చేసే ఇంకుడు గుంతల ఏర్పాటుకు తగిన స్థలాలను తక్షణమే గుర్తించి పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆస్పత్రులు, ఇతర ప్రభుత్వ ప్రాంగణాల్లో అత్యవసరంగా ఇంకుడు గుంతలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మూడు రోజుల్లో అందించాలని ఆదేశించారు. నగరంలో నూతన భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడంతో పాటు కొత్తగా ఇంటి నంబర్లు కేటాయించే సమయంలో ఇంకుడు గుంత ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. స్థలం కేటాయించి ఇంకుడు గుంత ఏర్పాటు చేస్తేనే అనుమతులు, ఇంటి నంబర్లు ఇవ్వాలని టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నగరంలోని వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్‌మెంట్లలోనూ ఇంకుడు గుంతల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించి, వాటిని నిర్మించుకునేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కమిషనర్ ఆయాజ్, డిప్యూటీ కమిషనర్లు వేణు మాధవ్, ఖాదర్ మొహియుద్దీన్, అసిస్టెంట్ కమిషనర్ రాజమనోహర్, ఈఈ లచ్చిరెడ్డి, డీసీపీ బషీరొద్దిన్, ఏసీపీలు వేణు, శ్రీధర్, డీఈలు దేవేందర్, ఓం ప్రకాష్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఏఈలు, టీపీఎస్‌లు, టీపీవోలు తదితరులు పాల్గొన్నారు.