CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 10:05 pm Posted by : rakeshkashaveni12@gmail.com

ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకల ఏర్పాట్లు

కరీంనగర్ , అక్టోబర్ 8 (చైతన్యగళం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన బతుకమ్మ, దసరా ఉత్సవాలను గతం కంటే ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న బతుకమ్మ, దసరా, దేవి నవరాత్రి ఉత్సవాలకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూ.2.80 కోట్ల అంచనా నిధులతో విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ అధ్యక్షతన, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సమక్షంలో ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుధ్య విభాగాల అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని 66 డివిజన్ల బతుకమ్మ పాయింట్లు, నిమజ్జనం పాయింట్లు, అంబేడ్కర్ స్టేడియంలో దసరా ఉత్సవాలకు చేపట్టాల్సిన సివిల్, ఎలక్ట్రికల్, పారిశుధ్య తదితర ఏర్పాట్లపై చర్చించారు. బతుకమ్మ పాయింట్ల వద్ద వీధి దీపాలు, లైటింగ్, సౌండ్ సిస్టమ్, తాగునీరు, చదును పనులు, నిమజ్జనం పాయింట్ల వద్ద బారికేడింగ్, అదనపు లైటింగ్, స్టేజ్‌లు, జనరేటర్లు, పారిశుధ్యం, మహిళల భద్రత తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పనులను మూడు రోజుల ముందుగానే పూర్తి చేసేలా కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అంబేడ్కర్ స్టేడియంలో దసరా ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, లైటింగ్, స్టేజ్ నిర్మాణం, రావణ దహనం కార్యక్రమాలకు తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కార్పొరేటర్ల సలహాలు, సూచనలు తీసుకుని డివిజన్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ మహిళలు ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ పండగ జరుపుకునేలా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. నిమజ్జనం సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు. కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసి, సివిల్, లైటింగ్ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బతుకమ్మ నిమజ్జనం పాయింట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ ఆయాజ్, డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియుద్దీన్, వేణు మాధవ్, అసిస్టెంట్ కమిషనర్ రాజమనోహర్, ఇన్‌చార్జ్ ఈఈ లచ్చిరెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.